మనిషి యంత్రాలను సృష్టిస్తున్నాడు
యంత్రాలు మనిషిని యాంత్రికం చేస్తున్నాయి.
నామెదడులో వచ్చిన ఆలోచనలు నాచేత్తో నాకలంతో కాయితంమీద పెట్టేను ఒకప్పుడు.
న కి దీర్షమిస్తే. నా, మ కి ఎత్వమిస్తే మె అనుకుంటూ రాసేను.
క్రమంగా కీలు కొట్టుకోడం వచ్చేక ఒత్తులూ దీర్ఘాలమీద దృష్టి లేదింక.
తప్పులు మొదలయేయి.
మీకు పని తేలికంటూ సాంకేతికనిపుణులు సృష్టిస్తున్నారు మరిన్ని కొత్త కొత్త సాధనాలు.
Spell-check స్థాయి దాటి పదాలు, వాక్యాలు, ... మొత్తం కథంతా అదే రాసేస్థాయికి చేరింది.
నేను పూర్తిగా యాంత్రికం అయిపోయేను. పూర్వం అహం బ్రహ్మాస్మి అని ఒక మహావాక్యం. అందులో ఆంతర్యం నేను అంటూ వేరే లేదు అనే.
ఇప్పుడూ అంతే. నేను లేను. spell-check తో మొదలైన సాధనాలు AI, gemini, co-pilot, ఇంకా ఏవో నాకర్థం కాని పేర్లతో రాసేస్తాయి. వేరే నేను అనే పదార్థం మరి లేదు.
రచయితకి తనదంటూ ప్రత్యేకమైన ఒక శైలి లేదు. రావిశాస్త్రిలా రాసేడు, లతలా రాసింది అని చెప్పుకోడానికి లేదు.
ఏఐ, జెమినీ కాకపోతే రాబోయే యంత్రం సృష్టించేదే నువ్వో నేనో అవుతుంది.
అందుకే ఈ పోస్టు ఆఖరిపోస్టు అంటాను. నేను రాసేను, ఇది నాశైలి అని చెప్పుకోడానికి లేదు.
పూర్వం సాహిత్యం మానసికవికాసంకోసం. ఇప్పుడు సాహిత్యం సామాజికవిజయంకోసం.
సాంకేతికనైపుణ్యం సాధనకోసం నేను నేనుగా మనగల ఆస్కారంలేదు.
అందుకే అంటున్నాను క్రమపద్ధతిలో నిదానంగా ఒకొక కొత్త లక్షణంతో కొంచెం చప్పున నేను అను పదార్థం లేకుండా పోతోంది. యంత్రం నన్ను యాంత్రికం చేసింది.
నేను కొంచెం కొంచెంగా చస్తున్నాను.
- నిడదవోలు మాలతి.
అక్టోబరు 17, 2026
దీనికి ప్రతిక్రియ, (పాత)సాహిత్యం చదువుకుంటూ వెళ్ళటం - అని , నా ఆశండీ. ఏఐ , శైలిని పట్టుకోగలదు నిజమే కాని ప్రస్తుతానికి దాని శైలి లో ఏమంత వైవిధ్యం ఉండటం లేదు. చేతి తో చేసిన పని దైన వైలక్షణ్యం, యంత్రాల తర్వాతా నిలిచే ఉంది కదా...
రిప్లయితొలగించండిఅవునండి. శంకరభాష్యాలు, అష్టావక్రగీతవంటివి చూస్తున్నాను. నిజానికి నాకు వాటిలో కూడా వేదాంతంకంటే పదసౌందర్యమే ఎక్కువ ఇష్టం. వేదాంతం కూడా వస్తోంది. 89 దాటేయి కదా.
తొలగించండి