మాలతిని నేను. నన్ను నిడదవోలు మాలతి అంటారు. ఇందులో నాచింతనలూ, చింతలూ, సందేహాాలు ఉంటాయి. , కతలూ వెతలూ,

17, అక్టోబర్ 2026, శనివారం

నేను నిదానంగా చస్తున్నాను

మనిషి యంత్రాలను సృష్టిస్తున్నాడు

యంత్రాలు మనిషిని యాంత్రికం చేస్తున్నాయి.

నామెదడులో వచ్చిన ఆలోచనలు నాచేత్తో నాకలంతో కాయితంమీద పెట్టేను ఒకప్పుడు.

న కి దీర్షమిస్తే. నా, మ కి ఎత్వమిస్తే మె అనుకుంటూ రాసేను.

క్రమంగా కీలు కొట్టుకోడం వచ్చేక ఒత్తులూ దీర్ఘాలమీద దృష్టి లేదింక.

తప్పులు మొదలయేయి.

మీకు పని తేలికంటూ సాంకేతికనిపుణులు సృష్టిస్తున్నారు మరిన్ని కొత్త కొత్త సాధనాలు.

Spell-check స్థాయి దాటి పదాలు, వాక్యాలు, ... మొత్తం కథంతా అదే రాసేస్థాయికి చేరింది.

నేను పూర్తిగా యాంత్రికం అయిపోయేను. పూర్వం అహం బ్రహ్మాస్మి అని ఒక మహావాక్యం. అందులో ఆంతర్యం నేను అంటూ వేరే లేదు అనే.  

ఇప్పుడూ అంతే. నేను లేను. spell-check తో మొదలైన సాధనాలు AI, gemini, co-pilot, ఇంకా ఏవో నాకర్థం కాని పేర్లతో రాసేస్తాయి. వేరే నేను అనే పదార్థం మరి లేదు.

రచయితకి తనదంటూ ప్రత్యేకమైన ఒక శైలి లేదు. రావిశాస్త్రిలా రాసేడు, లతలా రాసింది అని చెప్పుకోడానికి లేదు.

ఏఐ, జెమినీ కాకపోతే రాబోయే యంత్రం సృష్టించేదే నువ్వో నేనో అవుతుంది.  

అందుకే ఈ పోస్టు ఆఖరిపోస్టు అంటాను. నేను రాసేను, ఇది నాశైలి అని చెప్పుకోడానికి లేదు.  

పూర్వం సాహిత్యం మానసికవికాసంకోసం. ఇప్పుడు సాహిత్యం సామాజికవిజయంకోసం.

సాంకేతికనైపుణ్యం సాధనకోసం నేను నేనుగా మనగల ఆస్కారంలేదు.

అందుకే అంటున్నాను క్రమపద్ధతిలో నిదానంగా ఒకొక కొత్త లక్షణంతో కొంచెం చప్పున నేను అను పదార్థం లేకుండా పోతోంది. యంత్రం నన్ను యాంత్రికం చేసింది.

నేను కొంచెం కొంచెంగా చస్తున్నాను.

 

- నిడదవోలు మాలతి.

అక్టోబరు 17, 2026

 

 

16, అక్టోబర్ 2026, శుక్రవారం

 పరిచయవాక్యాలు

ఇది కేవలం ఈబ్లాగు సరిగా పని చేస్తోందో లేదో చూడడానికి ప్రచురించేను. మీఅభిప్రాయం చెప్పండి. 

ఇది మెరుగు పరచడానికి ఏమీ చేయవచ్చో కూడా చెప్పవచ్చు. 

- ధన్యవాదాలు. మాలతి.

---------------------------

 

ఈ బ్లాగు 2010లో తెరిచేను. ఒక పోస్టు పెట్టేక మళ్లీ తిరిగి చూడలేదు.

ప్రస్తుతం తెలుగు తూలిక బ్లాగు, తూలిక.నెట్ వెబ్ సైటు లేవు. అందుకు ఎవరూ విచారించకపోవచ్చు. నాకు మాత్రం ముఖ్యంగా బ్లాగు లేకపోవడం కొరతగా ఉంది. కథలకోసం వ్యాసాలకోసం కాదు.

 

తెలుగుతూలిక ఉన్నప్పుడు నా సందేహాలకి సమాధానాలూ నావ్యాసాలలో తప్పులు తెలిసేవి. పండితులు, విషయపరిజ్ఞానం గలవారిమూలంగా సమాధానాలు దొరికేవి తెలిసేవి. ఒప్పులు తెలిసేవి.

ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అంచేత ఈ బ్లాగుకి వచ్చేను. ఎలా సాగుతుందో చూడాలి.

 

ప్రస్తుతానికి సాంకేతికంగురించి ఒకమాట చెప్తాను. నేను 40 ఏళ్లగా వాడుతున్నాను కంప్యూటరు. టవర్ రోజులనించి అరచేతిలో అమరిన ఐఫోనువరకూ. ముంజేతి వాచీలు కూడా వచ్చేయి కానీ నేను వాటిజోలికి పోవడంలేదు.

 ఇంతకీ కంప్యూటరులో చిన్న చిన్న చిరాకులొచ్చినప్పుడు అది అమ్మినవారి సపోర్టువారిని పిలిచేదాన్ని. అనతికాలంలో నాపాటి తెలిసినవారు కూడా అక్కడ లేరని తెలిసింది. మన పూజలలో అలవాటుగా పద్ధతిప్రకారం చేసేవి ఉంటాయి చూడండి పత్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి అని. అలాగే ఈ consumer support కూడాను. unplug, plug in, restart, reboot … ఇలా చెప్పుకుంటూ పోతారు ఆ సపోర్టర్లు. అవన్నీ నేను చేసేను అని చెప్పినా సరే మళ్లీ మొదలుపెట్టాలి.

ఇప్పుడు తెలిసింది Microsoft Surface 3 battery ఆరిపోతే మళ్లీ మరొక బేటరీ పెట్టలేరు ఆకంపెనీవారు కూడా. సరే పవర్ కార్డుతో వాడుతున్నాను. ఇప్పుడు మరికొన్ని బాధలు కూడా వచ్చేక, మరొక కంప్యూటరు కొందాం అనుకుని చూసేను.

అందులో ఉన్న ఫీచర్సు చూస్తే కళ్లు తిరిగేయి. AI, Gemini, Co-pilot, ... ఇంకా ఏవో నాకు అవేమిటో కూడా తెలీడంలేదు. తెలిసిందల్లా ఒకటే, నేను నేను కాకుండా పోయేను. ఆ యంత్రమే చేసేస్తుంది నేను రాయవలసింది, రాయదలుచుకున్నదీ అంతా. నా సంతకం కూడా అదే పెట్టేస్తుందనుకుంటాను.

ఆలోచిస్తుంటే అనిపించింది. 

మనిషి యంత్రం తయారు చేసేడు. యంత్రం మనిషిని యాంత్రికం చేసింది. 

వివరాలు చెప్తే మీకు విసుగు కలిగించవచ్చు కనక ఇక్కడితో ఆపుతాను.

శలవు

- నిడదవోలు మాలతి.

 

 

15, అక్టోబర్ 2026, గురువారం

కొత్త పోస్టులు

ఈ బ్లాగు 2010లో ప్రారంభించేను. 2 పోస్టులు పెట్టేక, మళ్లీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను కానీ సరిగా రావడం లేదు. ఇది ఎలా పని చేస్తోందో తెలుసుకోడానికి మాత్రమే

14, అక్టోబర్ 2026, బుధవారం

పునః ప్రవేశం

చాలాకాలం తరవాత మళ్లీ ఇక్కడ రాయాలనిపించి మొదలు పెడుతున్నాను. పూర్వంవలెనే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇవాళో రేపో మరొక పోస్టు పెట్టగలను. శుభం నిడదవోలు మాలతి

10, జులై 2010, శనివారం

ఇల్లు

అతనికి ఇల్లంటే
కంచం, మంచం, ఆపైన ఇల్లాలు అదనం

ఆమెకి ఇల్లంటే
పూర్వజన్మ సంచితార్థం.